రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు
కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో 15, సింగిల్ విండోల ఆధ్వర్యంలో 153 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగిలిన 278 కేంద్రాలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 271 మంది రైతుల నుంచి 2,958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.45 లక్షలను 31 మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేశామన్నారు. ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు 24 గంటల్లోగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ (08468 –220051) ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్‌వో మల్లికార్జున బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారి రమ్య, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి
మహాత్మా జ్యోతీబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎస్సీ, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలన్నారు. అధికారులు సమన్వయం చేయాలని సూచించారు.
అవసరమైన టార్పాలిన్‌లు
అందుబాటులో ఉంచండి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


