నాసిరకం సరుకులను విక్రయిస్తే చర్యలు తప్పవు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): దుకాణాలలో నాసిరకం సరుకులను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి సునీత సూచించారు. గోపాల్‌పేటలోని పలు దుకాణాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలోని పలురకాల సరుకులను ఆమె పరిశీలించారు. గోపాల్‌పేటలోని రాజరాజేశ్వర కిరాణ దుకాణంలో కాలంచెల్లిన సాంబార్‌పొడి ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఆమె చెప్పారు. దీంతోపాటు అదే దుకాణంలో నాసిరకం పల్లీలు విక్రయిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి రాజరాజేశ్వర దుకాణంలో శాంపిళ్లను సేకరించామని ఆమె వివరించారు. కాలం చెల్లిన, నాణ్యతలేని సరుకులను విక్రయిస్తే దుకాణాదారులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. గతఏడాది జిల్లాలో నాసిరకం సరుకులను విక్రయిస్తున్న దుకాణాల్లో సేకరించిన శాంపిళ్లకు సంబంధించి 6కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు. ఇప్పటివరకు ఒక కేసు నమోదైందని ఆమె చెప్పారు. కాగా మండలకేంద్రం గోపాల్‌పేటలో ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి ఆకస్మిక తనిఖీల విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు వారి దుకాణాలను మూసి ఉంచారు.
జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి సునీత


