నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామపంచాయతీలలో 60వేల మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, ఆరు నెలలుగా వారికి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5లక్షల ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని, జీవో నెంబర్ 51సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60ప్రకారంగా రూ.16,500 వేతనాన్ని ఇవ్వాలన్నారు. నాయకులు అరవింద్, రాజేశ్వర్, సత్యమ్మ, కార్మికులు మహేష్, రాము, చింటూ, సురేష్, బాలు, నరేష్, గంగాధర్, భోజన్న, నరేష్, శ్రీకాంత్, రమేష్, లింగం, రాజేశ్వర్, సాయిలు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.