ఆలమూరు: మండలంలోని మడికి గామానికి చెందిన ఉండ్రాసపు విలియం కేరీ అంతర్జాతీయ గోల్ షాట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి, జట్టు విజయానికి ప్రధాన కారకుడయ్యాడు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అతడు భారత్ అండర్–15 ఈ నెల 24న భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి గోల్ షాట్‌బాల్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. భారత్ జట్టు స్వర్ణ పతకంలో సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. విలియం కేరీని, తల్లిదండ్రులు సుందర విజయ్, రాజమణిలను స్థానికులు అభినందించారు.
4న సామూహిక
ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణ మాసం నాలుగో శుక్రవారాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 4న రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 7.30 గంటలకు స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ వ్రతం నిర్వహిస్తామన్నారు. వ్రతమాచరించే మహిళలు గాజులు, పువ్వులు, అరటి పండ్లు, రెండు కొబ్బరి కాయలు తెచ్చుకోవాలి. మిగిలిన పూజాద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూరుస్తుంది. మహిళలకు లక్ష్మీదేవి రూపు, తోరం, ప్రసాదం అందజేస్తామని, స్వామివారి దర్శనానంతరం అన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య అధికంగా ఉంటే వ్రత మండపాల్లో కూడా వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.


