అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని సత్యగిరిపై బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించిన కొంతమంది యువకులు హంగామా చేయడం, పెళ్లిబృందాల వారిపై దాడి చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఈ విదంగా మద్యం సేవించి పెళ్లిళ్లకు హాజరవడం, కొన్ని సార్లు పెళ్లిళ్లు జరిగే సత్రాల ఆవరణలోనే ఖాళీ మద్యం సీసాలు లభ్యమవడం దేవస్థానంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది కేవలం దేవస్థానం అధికారుల లోపమే కాదు. రాష్ట్రంలో అఽధికార కూటమి పాలనలో వీధి వీధిలో సులభంగా మద్యం అమ్మకాలు జరుగుతుండడం ప్రధాన కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పెళ్లిళ్లలోను, హోటళ్లలోను పలు రకాలుగా గలాటా సృష్టించే మద్యం బాబులు ఎంతోమంది అని దేవస్థానంపై ఉన్న వ్యాపారులు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డులు ఉన్నా వారిని నియంత్రించలేకపోతున్నారని వారంటున్నారు.
టోల్ గేట్ వద్ద నామమాత్రపు తనిఖీలు...
ప్రస్తుత అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ 2023లో దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు రత్నగిరి టోల్ గేట్ వద్ద అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండపైకి పంపించేవారు. మద్యం సేవించినా, వాహనాల్లో మద్యం బాటిళ్లు ఉన్నా అడ్డుకునేవారు. ఆయన తరువాత కొన్నాళ్లు ఇదే పద్ధతి అమలు చేసినా.. క్రమేపీ ఆ స్థాయిలో తనిఖీలు జరగడం లేదు. వివాహాల సీజన్‌లో ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తాయి కాబట్టి.. తనిఖీలకు ఎక్కువమంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంపై దృష్టిపెట్టాల్సి ఉంది.
పోలీసుల మధ్య కొరవడుతున్న సమన్వయం
అన్నవరం దేవస్థానం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటే, వివాహాలు జరిగే సత్యగిరి కొండ, సత్రాలన్నీ ఒంటిమామిడి (తొండంగి) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఇటువంటి వివాదాలు ఏర్పడినపుడు రెండు పోలీస్‌స్టేషన్ల మధ్య సమన్వయం కొరవడుతోంది. తొండంగి పోలీసులు సత్యగిరి చేరుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల దేవస్థానంలో ఔట్ పోస్టు ఏర్పాటు చేసి రెండు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది విధులు నిర్వహించేలా చూడాలి.
ఘాట్‌రోడ్డుకు కూతవేటు దూరంలో
మద్యం దుకాణాలు
అన్నవరంలో రెండు మద్యం దుకాణాలు దేవస్థానం ఘాట్‌రోడ్లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. ఒక మద్యం షాపు దేవస్థానానికి చెందిన పంపా సత్రం ముందే ఉంది. మరోటి తొలిపాంచాకు 200 మీటర్లు, టోల్‌గేట్‌కు 150 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పెళ్లిళ్లకు హాజరయ్యేవారు మద్యం సేవించి వస్తుంటే కొంతమంది కొండదిగువకు వచ్చి మద్యం సేవించి మరలా కొండమీదకు వెళుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ లోపాలను దేవస్థానం అధికారులు, పోలీసులు, ఎకై ్సజ్ విభాగాల వారు సరిదిద్దాల్సి ఉంది. లేనిపక్షంలో దేవస్థానంలో నెలకొనాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం కలుషితమవడంతో పాటు భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి.
సత్యదేవుని దేవస్థానం వద్ద
పెళ్లి బృందంపై మద్యం
సేవించిన యువకుల దాడి
ముగ్గురు యువకులపై న్యూసెన్స్ కేసు
ఉమ్మడి పోలీసులతో
రత్నగిరిపై ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలి


