బాల కార్మికులను పనిలో పెట్టొద్దని హెచ్చరిక
పిఠాపురం రూరల్: మండలంలోని విరవ, విరవాడ పరిధిలో గల ఇటుక బట్టీలను అధికారులు గురువారం సంయుక్తంగా తనిఖీ చేశారు. జిల్లా యంత్రాంగం, ప్రాజెక్టు డైరెక్టర్, డీసీపీఓ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం ‘సాక్షి’ ప్రచురించిన ‘బట్టీలలో బలవుతున్న బాల్యం’ కథనానికి స్పందించిన అధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులు, పని పరిస్థితులు, పిల్లల విద్యాభ్యాసం తదితర అంశాలపై ఆరా తీశారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఐదు వలస కార్మికుల కుటుంబాలను అధికారులు గుర్తించారు. నాలుగు కుటుంబాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవిగా, మరోటి తాళ్లరేవు మండలానికి చెందినదిగా గుర్తించి, వారి పిల్లల విషయం ఆరా తీశారు. 5 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను ఫకృద్దీన్‌పాలెం మండలపరిషత్ ఉన్నత పాఠశాలలో, 3, 4 సంవత్సరాల వయస్సు చిన్నారులను విరవ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని, ఎవరైనా బాలలు పనిలో ఉన్నట్టు గుర్తిస్తే, సంబంధిత బాల కార్మిక చట్టాల ప్రకారం యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఈవో వై.రాంబాబు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి.కుమారి, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


