11న అప్రెంటీస్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

11న అప్రెంటీస్‌ మేళా

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని వివిధ కంపెనీలకు సంబంధించి ఈ నెల 11న ప్రధాన మంత్రి అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ వేణుగోపాలవర్మ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణులై, ఎన్‌టీసీ సర్టిఫికెట్‌ కలిగిన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని సూచించారు.

9న స్విమ్మింగ్‌

క్రీడాకారుల ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): ఈ నెల 9న జిల్లా స్థాయి స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్విమ్మింగ్‌ సంఘం కార్యదర్శి ఐ.రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో జరిగే అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) మైదానం స్విమ్మింగ్‌ పూల్‌లో జరిగే ఎంపికలకు ఆసక్తి గల పురుషులు, మహిళలు హాజరు కావాలని కోరారు.

జీజీహెచ్‌ విస్తరణకు కృషి

కాకినాడ క్రైం: జీజీహెచ్‌ విస్తరణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా కాకినాడ జీజీహెచ్‌కు వచ్చిన ఆయన డీ అడిక్షన్‌ సెంటర్‌ను సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశమై, ఆయా యూనిట్లలో అందుతున్న వైద్య సేవలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అత్యవసర సేవల నాణ్యతకు తగిన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు సూచించారు. సమావేశంలో ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష టన్నుల ధాన్యం సేకరణ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రబీ ధాన్యం సేకరణ లక్ష్యం 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇప్పటి వరకూ లక్ష మెట్రిక్‌ టన్నులు సేకరించామని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ తెలిపారు. కలెక్టర్‌లో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.213.53 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.211.46 కోట్లు జమ చేశామని చెప్పారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ఖరీఫ్‌లో సీఎంఆర్‌ కింద 58 రైస్‌ మిల్లుల నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉందన్నారు. సీఎంఆర్‌ రైస్‌ను త్వరగా అందజేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రబీ ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని జేసీ అపూర్వ భరత్‌ చెప్పారు.

హుండీ ఆదాయం

రూ.19.31 లక్షలు

ఆలమూరు: చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం జరిగింది. రామచంద్రపురం దేవదాయ శాఖ తనిఖీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.బాలాజీ రాంప్రసాద్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ వీరి అప్పారావు, ఈఓ వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో స్థానిక ఆలయ ముఖ మండపంలో దేవదాయ శాఖ సిబ్బంది, మహిళా భక్త బృంద భక్తులు ఈ హుండీలను లెక్కించారు. గత నెల 4 నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ (32 రోజులు) రూ.19.31 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వీర్రాజు తెలిపారు.

భర్త చనిపోతే భార్యకు పింఛన్‌

అమలాపురం రూరల్‌: భర్త పింఛను పొందుతూ చనిపోతే భార్యకు స్పౌజ్‌ పింఛన్‌ మార్పు చేసి అందిస్తామని డీఆర్‌డీఏ పీడీ రాంబాబు బుధవారం తెలిపారు. త్వరలోనే వీటిని మంజూరు చేయనున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement