వాహనం అదుపు తప్పి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం అదుపు తప్పి యువకుడి మృతి

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 2:56 PM

జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామంలో మంగళవారం మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడు వాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఏఎస్సై మాణిక్యం అందించిన వివరాల మేరకు సామర్లకోట బ్రౌన్‌ పేటకు చెందిన మర్రి శ్రీనివాస్‌ అతని భార్య మంగ 15రోజుల క్రితం మండలంలోని గొల్లలగుంట గ్రామంలో నాటు కోళ్లు ఫారంలో పనికి వచ్చారు. వీరి కుమారుడు సామర్లకోట నుంచి మంగళవారం ఉదయం గొల్లలగుంటకు తల్లితండ్రులు చూసేందుకు వచ్చాడు. సాయింత్రం ఇంటికి వెళ్లడానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో తల్లితండ్రులకు కిరాణా సరుకులు తెచ్చేందుకు గ్రామంలోని దుకాణం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా తన మోటారు సైకిల్‌ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు జగ్గంపేట పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుడు సామర్లకోటలో చాపల వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా మూడేళ్ల కుమార్తె వుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కార్పొరేట్లకు మోదీ, బాబు ఊడిగం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కార్పొరేట్లకు ఊడిగం చేయడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పోటీ పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. గుజరాత్‌కి చెందిన 20 మంది కార్పొరేట్‌ పెద్దలు సుమారు రూ.27 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టినా వారిపై చర్యలు తీసుకోకుండా ఆ రుణాలు మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా బుధవారం నారాయణ విలేకరులతో మాట్లాడారు. బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చి అమరావతిలో అరటి తోటలు చూపించిన చంద్రబాబు వ్యవసాయ రంగానికి చేటు చేస్తున్న మోదీని నిలువరించడంలో భయపడుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత పథకాన్ని అమ లు చేయడం రాష్ట్రానికి భారమవుతుందనే విష యం చెప్పే స్థాయిలో చంద్రబాబు లేకపోవడం విచారకరమన్నారు. సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, తాటిపాక మధు పాల్గొన్నారు.

వాగ్వాదం ముదిరి నిప్పంటించి..

● పనిముట్ల విషయమై మెకానిక్‌ల మధ్య తగాదా

● విచక్షణ కోల్పోయి ఒకనిపై పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం

తుని: ఇద్దరు మెకానిక్‌ల మధ్య జరిగిన తగాదాలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాయకరావుపేట మండలం రామభద్రపురానికి చెందిన బైక్‌ మెకానికు రాజాకు, అదే మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన సైకిల్‌ మెకానిక్‌ నానాజీకి తుని రామా థియేటర్‌ ప్రాంతంలో పక్కపక్కనే షాపులు ఉన్నాయి. నానాజీ తరచూ రాజు దగ్గరకు వెళ్లి పనిముట్లు తెచ్చుకుని ఇవ్వడంలో అలసత్వం చూపేవాడు. ఈ క్రమంలో బుధవారం రెంచీల కోసం వెళ్లిన నానాజీతో రాజు వాగ్వాదానికి దిగాడు. వివాదం ముదిరి రాజు కోపంతో పక్కనే ఉన్న పెట్రోల్‌ను నానాజీపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని స్థానిక ఏరియా ఆస్పత్రికి పంపి అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై విజయ్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement