జీవనోపాధి చూపండి | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి చూపండి

Feb 17 2026 7:26 AM | Updated on Feb 17 2026 7:26 AM

జీవనోపాధి చూపండి

జీవనోపాధి చూపండి

కాట్రేనికోన: చేపల వేటకు దూరం అవుతున్నాం.. జీవనోపాధిని కోల్పోతున్నాం.. ఇసుక మేటలు వేసి పూడుకుపోయిన మొగను తవ్వించండంటూ అగ్నికుల క్షత్రియులు మహా ధర్నా చేపట్టారు. సోమవారం కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర సముద్ర తీరం వద్ద వేలాది మంది అగ్నికుల క్షత్రియులు ఆందోళనకు దిగారు. గచ్చకాయలపోర వద్ద సముద్రపు మొగ పూడుకుపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగిడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొగ పూడుకుపోవడంతో మత్స్య సంపద లేక ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మొగను తవ్వాలని కోరుతూ ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాలకు చెందిన ఎన్‌.కొత్తపల్లి, రాఘవులుపేట, ఎస్‌.యానం, పల్లం, గచ్చకాయలపోర, నాగపట్టణం, మర్రిచెట్టుకాలనీ, రాజానగరం, వేట్లపాలెం, చిర్రయానం గ్రామాలకు చెందిన సుమారు 3 వేల మంది అగ్నికుల క్షత్రియులు పార్టీలకు అతీతంగా ధర్నా చేశారు. తొలుత మొగ నుంచి గచ్చకాయలపోర వంతెన వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల పైబడి పర్ర భూములు ఉన్నాయని, కొంత మంది ఆక్రమించుకుని చెరువులు తవ్వేశారన్నారు. పర్ర భూముల్లో అక్రమ చెరువులు గుర్తించి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కూనవరం మొగతో వచ్చే సముద్రపు ఆటుపోట్లతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధిగా ఉండేదన్నారు. మొగ మూసుకుపోవడంతో పర్ర భూములు ఇసుక మేటలతో పూడుకు పోయాయన్నారు. సముద్రపు నీరు పర్ర భూములకు రావడం లేదని, మత్స్య సంపద లేక చేపల వేటపై ఆధారపడి జీవించే సుమారు 20 వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయామన్నారు. చేపలు వేట లేక వలస కూలీలుగా ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అప్పటి ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కూనవరం స్టైట్‌ కట్‌ను పరిశీలించారన్నారు. సముద్రపు పోటుకు ఉప్పు నీరు పంట చేలకు రాకుండా కూనవరం కాలువకు గచ్చకాయలపోర వద్ద ఆటోమేటివ్‌ సూయిజ్‌ కట్టి రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి దేవినేని ఉమా హామీ ఇచ్చారన్నారు. అయినా ఇప్పటికీ ఆ పనులు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దండుప్రోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వరరావు, మల్లాడి వెంకటరమణ, మూదే చిరంజీవి, సంగాని శ్రీను, ఆకుల రాంబాబు, బొడ్డు నాగేశ్వరరావు, అర్థాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే మొగ తవ్వించండి

అగ్నికుల క్షత్రియుల మహా ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement