ముగ్ధ మనోహరమే..
పిఠాపురం: గరళకంఠుడి గజ్జెల సవ్వడితో పీఠికాపురం పులకించింది. ఆదిదేవుడు కై లాసం నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్టుగా నిర్వహించిన ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా జరిగింది. తెల్లవారు జామున పిఠాపురం మహారాజా రాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ వారి పేరున ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో లింగోద్భావ పూజలు, అభిషేకాలు, తొలి అర్చన చేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్త జనసందోహం నడుమ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాల అనంతరం ఆలయం నుంచి పల్లకిలో ఊరేగించారు. అనంతరం కుంతీ మాధవస్వామివారి ఆలయం వద్ద ఉన్న స్వామివారి రథం వద్దకు తీసుకెళ్లారు. బ్యాండుమేళాల నడుమ విద్యుద్ధీపాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించిన రథంపై పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించిన ఉత్సవ విగ్రహాలను వేదపండితులు అధిష్టించగా, రథోత్సవాన్ని ప్రారంభించారు. మెయిన్‌రోడ్డు మీదుగా ఉప్పాడ సెంటర్ వరకూ కొనసాగిన ఉత్సవానికి అశేష భక్త జనవాహిని కదిలి వచ్చి స్వామివారి రథాన్ని లాగి తరించింది.
కలుపు మందు తాగి
వ్యక్తి మృతి
అంబాజీపేట: ఓ వ్యక్తి కలుపు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెచ్‌సీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం.. అంబాజీపేట నెల్లివారిపేటకు చెందిన నక్కా రవికుమార్ (48) ఈ నెల 14న గ్రామంలోని బస్టాండ్ వద్ద కలుపు మందు తాగాడు. అనంతరం తన సమీప బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. అతన్ని అమలాపురంలోని ప్రభుత్వాసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.


