స్కూటీని ఢీకొన్న వ్యాన్
గండేపల్లి: జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో భర్తకు తీవ్ర గాయాలు కాగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన భార్యాభర్తలు అనంతం వెంకట సీతారామారావు (రాంబాబు), లోకమణిలు స్కూటీపై రాజమహేంద్రవరంలోని పెద్ద కూతురు భారతి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మల్లేపల్లి శివారులో అమ్మవారి ఆలయ సమీప దాబా వద్దకు వచ్చేసరికి తునిలో ఈవెంట్‌కు వెళుతున్న ఎస్‌బీజే బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ వెనుక నుంచి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా, భార్య లోకమణి సంఘటనా స్థలంలోనే అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, రోడ్డు సేఫ్టీ, హైవే సిబ్బంది క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన తర్వాత ఉడాయించేందుకు ప్రయత్నించడం, వ్యాన్ డ్రైవర్‌ను మార్చుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వ్యాన్‌లో సిబ్బంది రుబాబుకు దిగినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.


