ఘనంగా శూలాల సంబరం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శూలాల సంబరం

Feb 16 2026 7:24 AM | Updated on Feb 16 2026 7:24 AM

ఘనంగా

ఘనంగా శూలాల సంబరం

అమలాపురం రూరల్‌: ఇమ్మిడివరప్పాడులో కరికాల భక్తుల ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద శూలాల సంబరం ఆదివారం వైభవంగా జరిగింది. యువకులు ఉపవాస దీక్షతో బుగ్గలు, కంఠానికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. శూలధారులను ట్రాక్టరుపై ఉంచి బాజాభజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహించారు.

వరములివ్వు వినాయకా..

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 53 మంది, లక్ష్మీగణపతి హోమంలో 29 మంది భక్తులు పాల్గొన్నారు. ఒక చిన్నారికి నామకరణ, ముగ్గురికి అన్నప్రశన, ముగ్గురికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఐదుగురికి తులాభారం సమర్పించారు. 46 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 6,258 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,67,299 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

నేటి నుంచి సహకార సమ్మె

అమలాపురం టౌన్‌: జిల్లా సహకార ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఫలితం లేక పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విధిలేక ఈనెల 16 నుంచి సమ్మెకు దిగుతున్నామని జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితంగా జిల్లా సహకార సేవలు సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 298 వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు చెందిన సీఈఓలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గోనున్నారు. కోనసీమ జిల్లాలోని 166 సంఘాలు సోమవారం నుంచి మూత పడనున్నాయి. జీఓ నంబరు 36 ప్రకారం సహకార ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్‌. 2019 తర్వాత జాయిన్‌ అయిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగ విరమణ 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, జిల్లా కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి, ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్‌లు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు.

భాష్యం బ్లూమ్స్‌ స్కూల్‌ వార్షికోత్సవం

బాలాజీచెరువు (కాకినాడ): స్థానిక భాష్యం బ్లూమ్స్‌ స్కూల్‌ రెండో వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేఎన్‌టీయూకే వీసీ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించేలా విద్యా బోధన సాగాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్‌ పొలిశెట్టి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యతో పాటు మానసిక, శారీరక వికాసానికి వ్యాయామం చాలా అవసరమన్నారు. పాఠశాల జోనల్‌ ఇన్‌చార్జ్‌ వి.గోవిందరాజులు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యకే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించారు. ప్రిన్సిపాల్‌ దృవీన, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా శూలాల సంబరం1
1/2

ఘనంగా శూలాల సంబరం

ఘనంగా శూలాల సంబరం2
2/2

ఘనంగా శూలాల సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement