తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం
ఆత్రేయపురం : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి జక్కంపూడి విజయలక్ష్మితో కలసి ఆత్రేయపురంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఆలవాలమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సీబీఐ సిట్ వాస్తవాలు చెప్పినా మరింత దిగజారి శ్రీశైలం మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదంపై కూడా ఆరోపణలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమేనని మండిపడ్డారు. వెంటనే ఈ అసత్య ప్రచారాలను నిలిపివేసి స్వామివారి ప్రసాదంపై ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసాన్ని కాపాడాలని, లేకపోతే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానం తీర్పులను సైతం లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి, ప్రజలను భయానికి గురి చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ పాలల్లో కొవ్వు శాతం తగ్గిందని వచ్చిన నివేదికలపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


