రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి ఫ్లైవర్ బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపంలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్‌ను అన్నవరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని సరుగుడు తోట నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపానికి వచ్చేసరికి మలుపులో టిప్పర్‌ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని కొత్తపల్లి మండలం శ్రీరామపురానికి చెందిన పితాని కామరాజు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.


