లారీ ఢీకొని వృద్ధుడి మృతి
మామిడికుదురు: నగరం గ్రామంలో ఓఎన్‌జీసీ రిఫైనరీ గేటు ఎదురుగా 216వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన కోన వెంట్రావు (70) రిఫైనరీ గేటు ఎదురుగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌కి వెళ్లాడు. అక్కడ టిఫిన్ లేక పోవడంతో పక్కనే ఉన్న మరో హోటల్‌కి వెళ్లి సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అప్పటికే కదలిన ఓఎన్‌జీసీ మెయింటెనెన్స్‌కు సంబంధించిన లారీ ప్రమాదవశాత్తూ వృద్ధుడిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం వృద్ధుడి పొట్ట కింది భాగం నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 వాహనం వచ్చి అందులోని సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మోటారు సైకిల్ ఢీకొని..
ముమ్మిడివరం: నడిచి వెళుతున్న వ్యక్తి మోటారు సైకిలిస్టు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమానపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తకాలువకు చెందిన శీలం నాగేశ్వరరావు (54) గురువారం సాయంత్రం కూలిపనికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా యానాం నుంచి వస్తున్న మోటారు సైకిలిస్టు అతనిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు అందించిన తరువాత ఇంటికి తీసుకు వచ్చి శుక్రవారం ముమ్మిడివరం ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నాగేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని..
తుని: అన్నవరం–రావికంపాడు మధ్యలో రైలు ఢీకొని (45) ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. మృతుడు నలుపు, తెలుపు, ఆరెంజ్ రంగు అడ్డచారల టీషర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్ ధరించాడని, కుడిచేయి దండపై పెద్దసైజు టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మహిళ మెడలో గొలుసు అపహరణ
అన్నవరం: సత్యగిరిపై వివాహ వేడుకలు జరుగుతున్న వేళ వశుక్రవారం దుండగులు మహిళ మెడలో గొలుసును అపహరించారు. సత్యగిరి జంక్షన్‌లోని విద్యుత్ లైట్ వెలగకపోవడంతో అదే అదునుగా వివాహానికి హాజరైన ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు యువకులు లాక్కుని పరారయ్యారు. గొలుసు బరువు 26 గ్రాములు కాగా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.రెండు లక్షలు ఉంటుందని బాధితురాలు చెప్పినట్లు ఎస్‌ఐ శ్రీ హరిబాబు తెలిపారు. ఘటన స్థలంలో సీసీ టీవీలు కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఆధారాల కోసం సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవం
చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామంలో మతి స్థిమితం లేని 16 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం నామవరానికి చెందిన నందా శ్రీను అనే వ్యక్తికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు ఇచ్చినట్టు ఎస్సై కె.నరేంద్ర శుక్రవారం తెలిపారు. 2017 జూలై 19న బాలికపై అత్యాచారం చేయడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నందా శ్రీనుపై అప్పటి ఎస్సై జయబాబు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


