త్వరలో కొత్త ట్రస్ట్‌బోర్డు? | - | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త ట్రస్ట్‌బోర్డు?

Mar 22 2025 12:13 AM | Updated on Mar 22 2025 12:13 AM

త్వరలో కొత్త ట్రస్ట్‌బోర్డు?

త్వరలో కొత్త ట్రస్ట్‌బోర్డు?

ముగిసిన అన్నవరం దేవస్థానం

ధర్మకర్తల మండలి కాలపరిమితి

ఈ నెలాఖరులోగా ఏర్పాటయ్యే

అవకాశం

ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి

ఆశావహుల పేర్లు తీసుకున్న ప్రభుత్వం

కొత్త ట్రస్ట్‌బోర్డులో చైర్మన్‌తో

కలిసి 18 మంది సభ్యులు?

ఇద్దరు చొప్పున అవకాశం

కల్పించాలంటున్న బీజేపీ, జనసేన

దాత, శ్రీలలితా ఇండస్ట్రీ అధినేత

మట్టే సత్యప్రసాద్‌ పేరు సిఫారసు

అన్నవరం: స్థానిక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి త్వరలో నూతన ధర్మకర్తల మండలిని నియమించనున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌బోర్డు) కాల పరిమితి ఫిబ్రవరి ఎనిమిదో తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పాటయ్యే ధర్మకర్తల మండలిలో సభ్యత్వాల కోసం పేర్లు పంపించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గతంలోనే కోరింది. దీంతో మంత్రులు, ఆయా శాసనసభ్యులు ఆశావహుల జాబితాలను అధిష్టానానికి అందచేశారు. ఈ నెలాఖరులోగా ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

18 మందికి అవకాశం

కొత్త ట్రస్ట్‌బోర్డులో చైర్మన్‌తో సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయశాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్‌ ఈ బోర్డుకు చైర్మన్‌గా నియమితులవ్వనున్నారు. సభ్యులుగా 17 మందిని నియమించనున్నారు. వీరిలో సుమారు 12 మంది పురుషులు, ఐదు లేదా ఆరుగురు మహిళలు ఉంటారని సమాచారం. అన్ని సామాజికవర్గాలతో బాటు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, వర్గాలకు చెందిన వారికి ట్రస్ట్‌బోర్డులో స్థానం కల్పించనున్నట్టు సమాచారం.

గతంలో 16 మందితో..

2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని, 50 శాతం మహిళలు ఉండాలని భావిస్తూ మొత్తం 16 మందితో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో ఏడుగురు మహిళలు. మొత్తం 15 మందిలో ఎనిమిది మంది బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ ప్రకారం నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్‌బోర్డులో స్థానం కల్పించారు. దేవస్థానం చరిత్రలో ఈ విధంగా సగం మంది మహిళలు, బీసీ, ఎస్‌సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటైన ట్రస్ట్‌బోర్డుగా నిలిచిపోయింది.

కొత్త ట్రస్ట్‌బోర్డు సభ్యత్వాల కోసం మంత్రులు,

ఎంఎల్‌ఎ లపై వత్తిడులు:

అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యత్వాల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పై దిగువ శ్రేణి నాయకులు ఒత్తిడులు తెస్తున్నారు. అయితే ఇప్పటికే వారు ఈ పదవుల కోసం కొన్ని పేర్లు సిఫారసు చేసినట్టు సమాచారం.

● దేవస్థానానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించిన దాతగా, స్వామి, అమ్మవార్లకు వజ్రకిరీటాలు చేయించడం, రూ.ఐదు కోట్లు వ్యయంతో ప్రసాదం భవనం నిర్మించిన పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్‌ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్‌ పేరు ఆ నియోజకవర్గం నుంచి సిఫారసు చేసినట్లు సమాచారం.

● ట్రస్ట్‌బోర్డులో బీజేపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున నియమించాలని ఒత్తిడి వస్తున్నా ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఉండనుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గట్టిగా పట్టుబడితే రెండో వ్యక్తిని ఆ పార్టీ నుంచి నియమించే అవకాశం ఉంది.

● సత్యదేవుని ఆలయం కలిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గతంలో మాదిరిగా ఇద్దరికి ట్రస్ట్‌బోర్డులో అవకాశం కల్పించనున్నారు. అయితే ఒకరు టీడీపీ, ఇంకొకరు జనసేన లేదా బీజేపీ నుంచి నియమితులవుతారని అంటున్నారు.

● జగ్గంపేట, కాకినాడ టౌన్‌ లేదా కాకినాడ రూరల్‌, తుని నియోజకవర్గాల నుంచి టీడీపీ నుంచి ఒక్కొక్కరికి ట్రస్ట్‌బోర్డులో అవకాశం లభించే అవకాశం ఉంది.

● అనపర్తి నియోజకవర్గం, కోనసీమ నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు.

● గతంలో గుంటూరు జిల్లా నుంచి కూడా ఒకరికి ఈ ట్రస్ట్‌బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. అదే ఆనవాయితీని ఈ సారి కూడా పాటిస్తారంటున్నారు.

అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement