
కనుల నిండుగ.. విరుల పండగ
● వైభవంగా సత్యదేవుని శ్రీపుష్పయాగం
● సుగంధ సుమాలతో పరిమళించిన
కల్యాణ మంటపం
● సుమధుర ఫలాలు, పిండివంటలు
స్వామివారికి నివేదన
అన్నవరం : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీపుష్పయాగం నిత్య కల్యాణ మంటపంలో కన్నుల పండువగా జరిగింది. ఒకవైపు కల్యాణ మంటపంలో అలంకరించిన పుష్పమాలికలు...ఇంకొకవైపు రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు ఆకట్టుకున్నాయి. నూతన పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించి కల్యాణ శోభతో ప్రకాశిస్తున్న శ్రీసత్యదేవుడు, అమ్మవారి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు.
రాత్రి 7–30కి మొదలైన వేడుక
పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా, నవ దంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కల్యాణ మంటపానికి రాత్రి ఏడు గంటలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. నిత్యకల్యాణ మంటప వేదికపైగల వెండి సింహాసనంపై స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనంపై పెళ్లిపెద్దలు సీతారాములను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7–30 గంటలకు పండితుల మంత్రోచ్ఛారణతో శ్రీపుష్పయోగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వర పూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీస్సులు అందజేశారు.
శాస్త్రోక్తంగా పవళింపు సేవ
తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలలో ఉంచి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో గల సత్యదేవుడు, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో పూజించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోచ్ఛాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ జాకెట్టు ముక్కలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, కంచిభట్ల రామ్‌కుమార్, సుధీర్, దత్తాత్రేయశర్మ, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి కన్నబాబు నిర్వహించారు. రెండేళ్ల అనంతరం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగంతో ముగిశాయి.

కనుల నిండుగ.. విరుల పండగ

కనుల నిండుగ.. విరుల పండగ

కనుల నిండుగ.. విరుల పండగ