టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం | - | Sakshi
Sakshi News home page

టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం

Mar 19 2026 8:21 AM | Updated on Mar 19 2026 8:21 AM

ఐసీడీఎస్‌ ఆర్‌జేడీ సుజాతా రాణి

కాకినాడ క్రైం: టీనేజీ గర్భ ధారణలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) సుజాత రాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్మార్ట్‌ సిటీ కార్యాలయ ఆవరణలో ఫ్యాబిన్‌ కన్వెన్షన్‌లో శాఖ తరఫున పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో టీనేజ్‌ గర్భ ధారణలు, బాల్య వివాహాల నిర్మూలనపై డివిజినల్‌ స్థాయి దిశానిర్దేశ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజాత రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి సంభవిస్తోందన్నారు. సరైన లైంగిక విద్య, కుటుంబం వ్యవస్థ, సమాజం పట్ల అవగాహన లేకపోవడం బాలికల భవితను చిదిమేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరకపోతే సిబ్బంది విఫలమైనట్లేనని అన్నారు. సమాజంలో కీలక వర్గాలన్నీ పని చేస్తేనే బాలికలను ఈ దురాగతాల నుంచి రక్షించగలమని సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీడీ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు, అందువల్ల కలుగుతున్న టీనేజీ గర్భధారణలు బాలికల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అవగాహన క్షేత్రస్థాయికి చేరేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులో వివాహం జరిగితే చదువు మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక వెసులుబాటు లోపించడం, జీవితంలో స్వతంత్రత కోల్పోవడం, తల్లీ బిడ్డలకు పోషకాహార లోపం, మాతా శిశు మరణాలు సంభవించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు, వారి ఎదుగుదలలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు వాటిల్లుతాయన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని లక్ష్మి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మణమూర్తి, డీసీపీవో వెంకట్‌, డీఐవో డాక్టర్‌ సుబ్బరాజు, మెప్మా అసిస్టెంట్‌ పీడీ జిలానీ, డీఎస్‌డీవో గోపికృష్ణ, పారా లీగల్‌ అడ్వకేట్‌ హేమ పద్మజ సహా ఐసీడీఎస్‌ సిబ్బంది, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, మెప్మా సిబ్బంది, సీడీపీవోలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ, వన్‌స్టాప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement