సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు
అమలాపురం రూరల్: ఏపీ, తెలంగాణలలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఎండీ, డైరెక్టర్లకు కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించినా బాధితులకు న్యాయం జరగలేదని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బుద్ధ విహార్‌లో జరిగిన ఏజెంట్లు, బాధితుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 2011లో స్థానికంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి 2014 వరకు సుమారు రెండు వేల మంది నుంచి రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారన్నారు. 2015లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.అంకయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు మండలం ఈదరపల్లి పంచాయతీ పరిధిలో రెండు భవనాలు, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో 25 సెంట్ల కొబ్బరి తోట, 8 సెంట్ల ఇంటి స్థలం. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 4 ఏకరాల భూమి, శ్రీకాకుళంలో 10 ఎకరాలు భూమి, తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ ప్రాంతంలో 140 ఎకరాల భూమి. రాజోలు మండలం శివకోడులో వారు నివసిస్తున్న రూ.50 లక్షల విలువైన భవనం, సంస్థ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. కేసు విచారణ సమయంలో సీజ్ చేసిన ఆస్తులను కంపెనీ ఎండీ భూసిం నాగ వెంకట వేణు, డైరెక్టర్లు బినామీ పేర్లతో విక్రయించారు. ఈ కేసులో మార్చి 16వ తేదీన సంస్థ ఎండీ భూసి నాగ వెంకట వేణుకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, డైరెక్టర్లు రాజ్యలక్ష్మికి ఐదేళ్లు, గౌతమికి మూడేళ్ల జైలు శిక్షతో భారీ జరిమానా విధించారు. రూ.వెయ్యి డిపాజిట్ చేసిన బాధితులందరికీ న్యాయం చేయాలని కోర్టు అదేశించిందని, గతంలో కలెక్టర్ సీజ్ చేసిన సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెంట్లు సంఘం ప్రతినిధులు చింతా రత్నం రాజు, జల్లి ప్రసన్నవాణి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


