నేటి నుంచి సీఆర్‌సీ ఉగాది నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీఆర్‌సీ ఉగాది నాటిక పోటీలు

Mar 19 2026 8:21 AM | Updated on Mar 19 2026 8:21 AM

రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ (సీఆర్‌సీ) కాటన్‌ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 26వ సిల్వర్‌ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తెలిపారు. సీఆర్‌సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ఏడు నాటికలు, సీఆర్‌సీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 26 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తూ నాటికలకు పూర్వ వైభవం తీసుకు రావాలని కృషి చేస్తున్నామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం బాలబాలికల నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఏడాది కాటన్‌ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అందిస్తారన్నారు. తెలుగు రంగస్థలానికి మణిహారంగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన నటీమణి కె.విజయలక్ష్మిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గురువారం హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్స్‌ బృందం ‘అమ్మ చెక్కిన బొమ్మ’, కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్‌ బృందం ‘కన్నీటికి విలువెంత’ ప్రదర్శించనున్నారు. శుక్రవారం గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్‌ బృందం ‘సహాన’, విశాఖకు చెందిన తెలుగు కళా సమితి ‘చిటికెన వేలు’, చైతన్య కళా స్రవంతి ‘అసత్యం’, మూడో రోజు 21న కాకినాడకు చెందిన ఎస్‌వీ రంగారావు కళా స్రవంతి బృందం ‘ఆచమనం’, విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్‌ బృందం ‘దొందూ దొందే’ నాటికలతో పాటు చివరి రోజు సీఆర్‌సీ వారి ప్రత్యేక ప్రదర్శన ‘బంగారు లేడి’ ప్రదర్శించనున్నారు. ప్రతి నాటికకు రూ.25 వేలు పారితోషికం, వివిధ విభాగాల్లో వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సీఆర్‌సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, కళా పరిషత్‌ డైరెక్టర్లు కె.సూర్య, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్న బుజ్జి), కొవ్వూరి నరేష్‌కుమార్‌ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు, కె.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement