
●
● 103 కోట్లకు చేరిన కుంకుమార్చనలు
● మహాశక్తి యాగం విజయవంతం
కాకినాడ రూరల్: శ్రీ లలితా సహస్ర నామం.. 64 వేల కోట్ల మంత్రాల సారం.. మహాశక్తిని ప్రసాదించే దివ్యమంగళ స్తోత్రం.. ఈ మహిమాన్విత నామావళితో లలిత అమ్మవారికి.. మహాశక్తి యాగ ప్రాంగణంలో శతకోటి కుంకుమార్చలు నిర్వహించిన వేళ.. పవిత్ర కార్తిక మాసంలో కాకినాడ రమణయ్యపేటలోని శ్రీపీఠం అరుణారుణ కాంతులను అద్దుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే వేదికపై వేలాది మంది మహిళలు లలితా సహస్ర నామాలతో చేసిన శతకోటి కుంకుమార్చనలు.. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పట్టుదల, దీక్షతో సంపూర్ణమయ్యాయి. వంద కోట్ల లలితా కుంకుమార్చనలు విజయవంతంగా జరగడమే కాదు.. ఏకంగా 103 కోట్లు పూర్తయ్యాయి. మహాశక్తి యాగంలో 27వ రోజైన ఆదివారం ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గత నెల 14న కార్తిక మాసం తొలి రోజున ఇక్కడ ఈ మహాశక్తి యాగం ప్రారంభమైంది. ప్రతి రోజూ నక్షత్ర శాంతి పూజలు, లలితా సహస్ర నామాలతో కుంకుమార్చనలు, సాయంత్రం కోటి దీపోత్సవం, రాత్రి బగళాముఖి హోమం, అతిరుద్ర యాగం నిర్వహించారు. మహాశక్తి యాగం బుధవారం పరిసమాప్తి కానుంది. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, కరోనా తరువాత చాలా మంది అర్ధాయువుతో తనువు చాలిస్తున్నందున, అకాల మృత్యువును నిరోధించేందుకు, ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు ఈ మహాశక్తి యాగం తలపెట్టానని చెప్పారు. వందకోట్ల లలితా కుంకుమార్చనను భక్తుల సహకారంతో పూర్తి చేసుకున్నామని చెప్పారు. ప్రకృతి సహకరించకపోయినా ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత అనుగ్రహంతో దీక్షా వస్త్రాలు ధరించి, కుంకుమార్చనలు చేయడం అద్భుతమని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ 24 నిమిషాలు అమ్మవారికి కేటాయించి, లలితా సహస్ర నామాలు పఠించాలని చెప్పారు. సీ్త్త్రలను నొప్పించరాదన్నారు. మహాశక్తి యాగంలో భాగంగా ఉదయం నక్షత్ర శాంతి హోమాలు, అనంతరం కుంకుమార్చనలు నిర్వహించారు. మహాశక్తి యాగం వేదికపై నుంచి ఉదయం మాతా శివ చైతన్యానంద ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. వంద కోట్ల లలితా కుంకుమార్చనలు విజయవంతంగా పూర్తి చేసినందుకు పరిపూర్ణానంద స్వామికి ఆమె మహా హారతి ఇచ్చి, సత్కరించారు. సాయంత్రం కోటి దీపోత్సవం అనంతరం బగళాముఖి హోమం నిర్వహించారు. మహాశక్తి యాగాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ మంత్రి, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు సందర్శించారు. బాపిరాజు దంపతులు దీపోత్సవంలో పాల్గొన్నారు.
కుంకుమార్చన చేస్తున్న భక్తులు
కుంకుమార్చన చేస్తున్న భక్తులు

లలితా సహస్ర నామార్చన చేయిస్తున్న పరిపూర్ణానంద స్వామి