నా బిడ్డల్ని రక్షించండి | - | Sakshi
Sakshi News home page

నా బిడ్డల్ని రక్షించండి

May 21 2025 12:06 AM | Updated on May 21 2025 12:06 AM

నా బిడ్డల్ని రక్షించండి

నా బిడ్డల్ని రక్షించండి

కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్‌ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్‌, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌కు పరమేశ్వర్‌, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు వర్చువల్‌గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్‌స్టాప్‌ సెంటర్‌ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్‌ దుర్గారాణి, సోషల్‌ వర్కర్‌ ఎస్‌.చినబాబు కూడా ఉన్నారు.

ఫ నడిరోడ్డుపై.. హోరువానలో

ఓ అమ్మ ఆక్రందన

ఫ పిల్లలకు ఆహారం,

వైద్యం అందించలేక వేదన

ఫ తక్షణమే స్పందించిన

డీసీపీయూ బృందం

ఫ తల్లి, ముగ్గురు పిల్లలకు రక్షణ

ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకై నా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటన కాకినాడ బస్టాండ్‌ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్‌ అధికారుల కథనం ప్రకారం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement