జంట ఆత్మహత్యపై కేసు | - | Sakshi
Sakshi News home page

జంట ఆత్మహత్యపై కేసు

May 20 2025 12:20 AM | Updated on May 20 2025 12:20 AM

జంట ఆ

జంట ఆత్మహత్యపై కేసు

సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్‌ పరిధి వేట్లపాలెంలో ఒక జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాకినాడ సిద్ధార్ధ ఆస్పత్రి, గైడ్‌ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఉప్పల పోసిబాబు (40), గైడ్‌ మెడికల్‌ షాపులో పని చేస్తున్న గెద్దం దివ్యనాగలక్ష్మి (35) ఈ నెల 17న రైలుకు అడ్డుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయట పడుతుందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిల్‌పై వచ్చారు. అక్కడి నుంచి వేట్లపాలెం వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను రైల్వే ట్రాలీ మేన్‌ డి.లక్ష్మణరావు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతులిద్దరికీ వివాహాలు కాగా పోసిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోసిబాబు తన పెద్ద కుమారుడికి ఫోన్‌చేసి చనిపోతున్నట్లు చెప్పాడని వివరించారు. మృతుడి జేబులో ఉన్న సూసైడ్‌ నోట్‌లో వివరాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై వాసు తెలిపారు.

శ్యాంబాబు మృతి

మాదిగలకు తీరని లోటు

కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్‌ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్‌లో ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

గుండెపోటుతో

హెడ్‌ నర్స్‌ మృతి

పి.గన్నవరం: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్న జీఎల్‌ అనంత కుమారి (59) సోమవారం గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అనంత కుమారి సోమవారం మధ్యాహ్నం తనకు నీరసంగా ఉందని ఇంట్లో చెప్పి తణుకులోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. గత 20 రోజుల నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈనెల 23న విధులకు హాజరు కావాల్సి ఉంది. పి.గన్నవరం సీహెచ్‌సీలో 2023 జూన్‌లో ఆమె హెడ్‌ నర్సుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతితో ఆస్పత్రి వైద్య సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.

అధికారులపై చర్యలు

తీసుకోవాలని ఫిర్యాదు

అమలాపురం రూరల్‌: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్‌లైన్‌లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతు అమలాపురం కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్‌లైన్‌ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు.

జంట ఆత్మహత్యపై కేసు 
1
1/2

జంట ఆత్మహత్యపై కేసు

జంట ఆత్మహత్యపై కేసు 
2
2/2

జంట ఆత్మహత్యపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement