
చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..
అన్నవరం: అన్నవరం.. ఈ పేరు వింటేనే ప్రతి భక్తుని మది మురిసిపోతుంది.. ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది.. అలాంటి రత్నగిరిపై లోటుపాట్లు విమర్శలకు తావిచ్చాయి.. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ స్పందించారు. చక్కదిద్దే చర్యలకు ముందుకు వచ్చారు.. ఇక నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజాదికాలు, స్వామివారి కల్యాణోత్సవాలు, వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై త్వరలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు రోహిత్ వెల్లడించారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాల్లో గతంలో జరిగిన ఉత్సవాలకు భిన్నంగా వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే. అదే విధంగా 13న జరిగిన స్వామివారి శ్రీపుష్పయాగంలో అమ్మవారిని స్వామివారికి ఎడుమవైపు కాకుండా కుడివైపునకు వచ్చేలా ఏర్పాటు చేయడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. కల్యాణోత్సవాల్లో చోటు చేసుకున్న అపశ్రుతులపై కూడా ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ప్చ్..కళ కట్టలేదు’ శీర్షికన కథనం వచ్చింది. దేవస్థానంలో వైదిక కార్యక్రమాల విధి విధానాలు రూపొందించాల్సిన వైదిక కమిటీ సరైన శ్రద్ధ చూపకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతితో చర్చించి వారి సూచనల మేరకు దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ఉత్సవాల్లో చేయాల్సిన క్రతువులు, హోమాలు నిలుపుదల చేయాలా వద్దా తదితర విషయాలపై కూడా స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
వైదిక సలహాదారుడు లేక ఇబ్బంది
దేవస్థానంలో గతంలో వైదిక కార్యక్రమాలపై సలహాలకు ప్రముఖ పండితుడిని వైదిక సలహాదారుగా నియమించి పూజలు నిర్వహించేవారు. తొలుత ప్రముఖ పండితుడు తంగిరాల బాలగంగాధరశాస్త్రి దేవస్థానం వైదిక సలహాదారుగా ఉండేవారు. ఆయన తరువాత రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2010 వరకూ కొనసాగారు. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన జాంపండు మాస్టారుగా పేరు పొందిన ప్రముఖ పండితుడు శ్రీసత్యనారాయణ మూర్తిని నియమించారు. ఆ తరువాత మరో సలహాదారుడిని నియమించలేదు. దీంతో దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకే వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వైదిక సలహాదారు లేని లోటు కనిపిస్తోంది. దేవస్థానంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన ప్రముఖ వేద, జ్యోతిష పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు, కంచి కామకోటి పీథం, శృంగేరీ పీఠాధిపతులతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిని వైదిక సలహాదారునిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాలు
‘సాక్షి’లో వరుస కథనాలతో చర్యలు
శృంగేరి పీఠాధిపతి సూచనలతో
ముందుకు..
అన్నవరం దేవస్థానం చైర్మన్
ఐవీ రోహిత్ వెల్లడి
విధి విధానాలు రూపొందిస్తాం..
ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి హోమాల నిలిపివేత, శ్రీపుష్పయాగం రోజున స్వామి, అమ్మవారి అలంకరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇటువంటి వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటాం. దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, అలంకరణలపై శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారిని మార్గదర్శనం చేయాలని కోరతాం. వారి సూచనలు, సలహాలు ప్రకారం నడుచుకుంటాం. వీటిని అతిక్రమించకుండా చూస్తాం.
–ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం

చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..

చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..

చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..