
గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాడి రాకేష్ (17) స్నేహితులతో కలసి కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ నేపథ్యంలో గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి తండ్రి శ్రీను, తల్లి, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. శ్రీను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మృతి ఘటనపై కొవ్వూరు పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల నుంచి సీతంపేట వద్దకు నిత్యం అధిక సంఖ్యలో స్నానాలకు వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
వ్యక్తి దుర్మరణం
కొత్తపేట: స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు (40) ఆదివారం రాత్రి స్థానిక దేవాలయంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొత్తపేట వచ్చాడు. నాగేశ్వరరావు పాత బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా అమలాపురం వైపు నుంచి రావులపాలెం వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మృతుని భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర వివరించారు.