
ఐఎఫ్‌ఎస్‌కు ములగపూడి విద్యార్థి ఎంపిక
రౌతులపూడి: మండలంలోని ములగపూడికి చెందిన చింతకాయల లవకుమార్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్‌ఎస్)కు ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన 2024 ఐఎఫ్‌ఎస్ పరీక్షా ఫలితాల్లో ఆయన 49వ ర్యాంకు సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరసర్వ చక్రవర్తి, వీర వరహాలు దంపతులకు లవకుమార్ జన్మించారు. ఆయనకు సోదరి స్వాతి ఉన్నారు. లవకుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకూ ములగపూడిలో చదువుకున్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ కత్తిపూడి రిఫరల్ పాఠశాలలోను, 9, 10 తరగతులు తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థలోను, ఇంటర్మీడియెట్ విజయవాడ చైతన్య జూనియర్ కళాశాలలో, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బీవీఎస్సీ డిగ్రీ చదివారు. కొంతకాలం వెటర్నరీ అంబులెన్స్‌లో సేవలందిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. రెండో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఎటువంటి కోచింగ్ లేకుండా, సెల్‌ఫోన్లు వాడకుండా పట్టుదలతో చదివారు. నిరంతర కృషితో ఎట్టకేలకు ఐఎఫ్‌ఎస్ సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఐఎఫ్‌ఎస్ సాధించిన మొదటి వ్యక్తి తమ కుమారుడు కావడం ఆనందంగా ఉందన్నారు. లవకుమార్ విజయంపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.