
ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలి
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్‌ల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం గోదాము భద్రతను తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, అగ్నిమాపక, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి యోగా
అవగాహన కార్యక్రమాలు
కాకినాడ సిటీ: యోగా పట్ల అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో బుధవారం నుంచి వచ్చే నెల 21 వరకూ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలు, మారథాన్, రంగోలి, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. మండల, వార్డుల్లో జరిగే యోగా కార్యక్రమాలకు శిక్షకులను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలని పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ ఈ నెల రోజులూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.