
కొనసాగిన ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లాలోని ఐదు ఆన్‌లైన్ కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 1,718 మంది హాజరవగా, 120 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్ష 856 మంది రాయగా, 62 మంది రాయలేదు. మధ్యాహ్నం పరీక్షకు 862 మంది హాజరు కాగా, 58 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. జేఎన్‌టీయూకేలోని ఎంసెట్ కార్యాలయం నుంచి కో కన్వీనర్లు, టీసీఎస్ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.
నేటి నుంచి ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు
ఈఏపీ సెట్‌లో భాగంగా బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకూ ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు జరుగుతాయి. దీనికి జిల్లావ్యాప్తంగా 8,957 మంది దరఖాస్తు చేశారు.
నేడు హుండీల
ఆదాయం లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించనున్నారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మరోవైపు దేవస్థానంలో నెల రోజులుగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో నవదంపతులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో, ఈసారి హుండీల ద్వారా రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 నుంచి సాయంత్రం వరకూ హుండీల ఆదాయం లెక్కించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం సిబ్బంది అందరూ హాజరు కావాలని ఈఓ ఆదేశించారు.
ఐసెట్‌లో
96.96 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌లో జిల్లా విద్యార్థులు 96.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7న ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 1,747 మంది హాజరవగా 1,700 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 696 మందికి గాను 681 మంది, బాలికలు 1,051 మందికి గాను 1,019 మంది అర్హత సాధించారు.
గడ్డర్ల ఏర్పాటు వాయిదా
కాకినాడ సిటీ: భారత్ మాల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సామర్లకోట – అచ్చంపేట మధ్య నిర్మిస్తున్న వంతెనలపై గడ్డర్లు ఏర్పాటు చేసే పనులను వాయిదా వేశారు. కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఈ విషయం తెలిపారు. సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ పనులు ఈ పనులు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే, వర్షాల కారణంగా దీనిని వాయిదా వేశారు. అందువలన సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు లేదని, ప్రయాణికులు, వాహనదారులు యథాతథంగా ప్రయాణించవచ్చని వివరించారు.
విఘ్నేశ్వరస్వామివారి హుండీ
ఆదాయం రూ.27,68,281
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు.
పరీక్షా కేంద్రంలో
ముగ్గురే విద్యార్థులు!
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు ముగ్గురంటే ముగ్గురే ఒకే ఒక్క కేంద్రంలో మంగళవారం జాగ్రఫీ పరీక్ష రాశారని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ పరీక్ష రాయాల్సిన ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.