హమ్మయ్య.. బండ భారం తగ్గింది | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. బండ భారం తగ్గింది

Published Thu, Aug 31 2023 2:20 AM

- - Sakshi

రాయవరం: మహిళలకు కేంద్ర ప్రభుత్వం రాఖీ పండగ కానుకగా తీపి కబురు అందించింది. గృహావసర గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.200 తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం వెలువరించింది. ప్రధానమంత్రి ఉజ్వల స్కీం లబ్ధిదారులకు మరో రూ.200 తగ్గించాలని సంకల్పించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 6,10,042 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది. తక్షణమే అమల్లోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో లబ్ధిని పొందే వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు
గృహావసరానికి వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రస్తుతం జిల్లాలో రూ.1,132 ఉంది. దీపం, జనరల్‌ లబ్ధిదారులకు రూ.200 తగ్గడంతో ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.932గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌ ధర రూ.732గా ఉంటుంది. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు వంట గ్యాస్‌ ధర భారీగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతోంది.

ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ ధర తగ్గించాలని నిర్ణయించింది. జనరల్‌ కనెక్షన్‌ లబ్ధిదారులకు ఇది వరకు రూ.200 సబ్సిడీని అందిస్తుండగా తాజాగా మరో రూ.200 ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. దీంతో వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.400 తగ్గనుంది. మధ్య తరగతి కుటుంబం సగటున 45 రోజులకు ఒక సిలిండర్‌ ఉపయోగిస్తుండగా, ఉజ్వల కనెక్షన్‌దారులు మూడు నెలలకు ఒకటి వంతున ఉపయోగిస్తున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని గ్యాస్‌ కనక్షన్లకనుగుణంగా ప్రతి నెలా సుమారుగా 3.40 లక్షల సిలిండర్లు వినియోగిస్తున్నట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement