చివరి తడిపై ఆశలు! | - | Sakshi
Sakshi News home page

చివరి తడిపై ఆశలు!

Nov 25 2026 1:07 AM | Updated on Nov 25 2026 1:07 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం కుడి, ఎడమ కాల్వ ఆయకట్టు కింద వానాకాలం వరి సాగు చేసిన రైతులు వారాబందీ విధానంలో చివరి వరకు నీరందుతుందా లేదా అని ఉక్కిరిబిక్కిరి అయిన రైతులు ఎట్టకేలకు పంట చేతికి రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడక్కడ 10 శాతం మేర పంటలు పొట్టదశలో ఉండటంతో ఆయా గ్రామాల రైతులు ప్రధాన ఎడమ కాల్వకు ఒక్క తడి నీరందిస్తే చేతికి అందుతాయని అధికారులను వేడుకుంటున్నారు. జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయడంతో అవాంతరాలను అధిగమించి చివరి దశకు రావడంతో రైతులు ప్రస్తుతం కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్‌నిలో ప్రభావంతో ఆశించిన మేర దిగుబడి రాకపోయినా ఈసారి వరికి బయటి మార్కెట్‌లో అధిక ధరలు పలుకుతుండటంతో పెట్టిన పెట్టుబడులు చేతికి అందుతాయనే ఆశతో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

ప్రధాన ఎడమ కాల్వ కింద..

జారాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 85 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేశారు. వీటిలో కేవలం రామన్‌పాడు వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లోనే 20 వేల ఎకరాల్లో వరి సాగైంది. అలాగే జూరాలను అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 650 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఆయకట్టుకు నీరు వదులుతారా లేదా అన్న సందేహంతో రైతులు ఆలస్యంగా వరి నారుమడులను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఒక తడి నీరు అందిస్తే ఆయా ఆయకట్టు పరిధిలో పొట్టదశలో ఉన్న వరి పంటలు చేతికందుతాయని రైతులు వేడుకుంటున్నారు.

ఒక తడి చాలు..

అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టులో 7 ఎకరాల్లో వరి సాగు చేశా. ఈసారి వానాకాలం పంటల సాగుకు జూరాల జలాశయం నుంచి నీరు ఆలస్యంగా వదలడం.. లిఫ్ట్‌ ద్వారా నీటి సరఫరా అవుతుండటంతో ఆశతో వరి సాగుచేశా. అందరికన్నా చివర్లో నారు పోయడంతో పంట కాలం ఆలస్యమైంది. ఒక్కతడి నీరుందిస్తే మొత్తం పంట చేతికందుతుంది.

– వేణుగోపాల్‌రెడ్డి, రైతు, అమరచింత

ఆలస్యంగా సాగు..

అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టులో 4 ఎకరాల్లో వరి ఆలస్యంగా సాగుచేశా. నీటి విడుదలపై స్పష్టత రాకపోవడంతో పంట పండించాలా వద్దా అన్న సందేహం నడుమ ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టి వరి సాగుచేశా. ప్రస్తుతం చాలావరకు పంటలు కోతదశకు చేరాయి. నా పంట చేతికందాలంటే ఒక్క తడి కావాల్సి ఉంది.

– కె.సత్యారెడ్డి, రైతు, అమరచింత

జూరాల ఆయకట్టులో పొట్టదశలో వరి పంటలు

మూడురోజులు నీరందిస్తే బయటపడతామంటున్న అన్నదాతలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అంటున్న అధికారులు

కొనసాగుతున్న పంట కోతలు

ఎగువ నుంచి వరద వస్తేనే..

ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తేనే ఆయకట్టుకు మరోసారి సాగునీరు వదిలే అవకాశం ఉంది. లేకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగునీటి విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. – చంద్రశేఖర్‌, ఏఈ, ప్రియదర్శిని జూరాల జలాశయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement