గద్వాల: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు, వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆఫీస్ బేరర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం చేసిందని, వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మూసివేందని ఆరోపించారు. ప్రభుత్వ రంగసంస్థలలో పెద్దఎత్తున పెట్టుబడులను ఉపసంహరించి దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. సామాజ్యవాదులతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మిక వర్గ శక్తిని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా దేశంలో వ్యవసాయ ఆహార సంక్షోభానికి తెరతీసిందన్నారు. గ్రామీణ పేదలకు ఉపయోగపడే ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వీబీజీ రాంజీగా మార్చిందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే మహాధర్నాలో జిల్లా నుంచి కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉప్పేరు నర్సింహ, వీవీ నర్సింహ, ఏమెలమ్మ, వెంకటేశ్వర్లు, సునీత, ఘటన, సీతారాం తదితరులు పాల్గొన్నారు.


