– గద్వాల న్యూటౌన్/ అలంపూర్/ ఎర్రవల్లి
అలంపూర్‌లో తుంగభద్ర నదికి హారతి ఇస్తున్న అర్చకులు
అలంపూర్: అలంపూర్ రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్డీఎస్ వాటాలో భాగంగా రాయలసీమకు సంబంధించిన నాలుగు టీఎంసీల నీరు హొస్పేట్ డ్యాంలో అందుబాటులో ఉందని, అలంపూర్ నియోజకవర్గంలోని రైతులకు ఈ నెల 28లోగా 2 లేదా 2.5 టీఎంసీల సాగునీరు విడదల చేసేలా అక్కడి అధికారులతో మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయమై ఏపీ ఈఎన్‌సీ అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అలాగే మల్లమ్మకుంట ప్రాజెక్టు పరిధిలో దాదాపు 600 ఎకరాల భూ నిర్వాసితులకు సాంకేతిక కారణాలతో పరిహారం అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు. మల్లమ్మకుంట ప్రాజెక్టుకు సంబంధించి 1.05 టీఎంసీల సామర్థ్యానికి ఆమోదం ఉన్నట్లు మంత్రికి వివరించారు. భూ సేకరణ అవసరం లేకుండా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2.05 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనపై మంత్రితో చర్చించినట్లు వివరించారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
●


