● ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు
● అంతర్జాతీయ ప్రమాణాలతో టీపీఎస్‌ల నిర్మాణానికి చర్యలు
● ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య
● వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్‌కు మంచి స్పందన వచ్చింది.
డేటా ఆధారిత ఎంపిక..
పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు.
ఒక్కో టీపీఎస్‌కు రూ.15 కోట్లు..
వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఒక్కో టీపీఎస్‌కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రానుంది. ప్రైవేటు స్కూళ్లకు ఽధీటుగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్‌ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.
ఆదర్శంగా వంగూరు టీపీఎస్..
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్‌లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.
సెమీ రెసిడెన్షియల్స్‌గా..
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది.


