అయిజ: రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శనివారం అయిజ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న బస్తాలను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్కెట్‌యార్డులో ఉన్న 70వేల మొక్కజొన్న బస్తాలను తరలించేందుకు మూడు రోజులుగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లుల గోదాంల్లో మొక్కజొన్న బస్తాల నిల్వ చేయడంపై యజమానులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. రవాణాకు సంబంధించి లారీల యజమానులు ముందుకు రాకపోతే.. ట్రాక్టర్ల ద్వారా గోదాంలకు తరలించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలకు బస్తాలు తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ పోతుల మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతి తదితరులు ఉన్నారు.
ధాన్యం సేకరణలో
అలసత్వం తగదు
ధరూరు: రైతుల నుంచి వరిధాన్యం సేకరణలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం ధరూరు మండలం రేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేసి, మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. రైతులకు సకాలంలో డబ్బులు కూడా అందడం లేదన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వరిధాన్యాన్ని త్వరగా సేకరించి.. మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, హన్మంతరాయ, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ పత్రాల వ్యవహారంలో ఐదుగురికి రిమాండ్
అయిజ: పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ ధ్రువపత్రాల తయారీ వ్యవహారంలో శనివారం పోలీసులు ఐదుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ మల్లేష్ వివరాల మేరకు.. అయిజ పట్టణంలోని నర్సింహ ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 1న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా వచ్చి నకిలీ పత్రాలు పొందుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ పత్రాలు తయారుచేస్తున్న అయిజ గొల్ల నర్సింహ, మునిస్వామితో పాటు గట్టు మండలానికి చెందిన పోతురాజు ఆంజనేయులు, నర్సింహులుగౌడ్, సిద్దప్పను అరెస్టుచేసి, అలంపూర్ కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


