వ్యాపారులకే మద్దతు | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులకే మద్దతు

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్‌ వ్యాపారుల అజమాయిషీ

రాజోళి: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి.. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అయితే కొందరు అవినీతి అధికారుల మూలంగా ఆ ప్రయోజనాలు రైతులకు చెందకుండా.. వ్యాపారులకు ‘మద్దతు’ దక్కుతుందనే వాదనలు వెల్లువెత్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు రైతుల కోసం పెట్టినప్పటికీ.. అక్కడ నడిచే పెత్తనం అంతా ప్రైవేట్‌ వ్యాపారులదే కావడంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న వ్యాపారస్తులే తమ ధాన్యాన్ని యథేచ్ఛగా అమ్ముకొని.. ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారని, ఇక్కడి రైతులు మాత్రం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురిస్తోంది.

అధికారికంగా అక్రమ లోడింగ్‌..

ఏపీ నుంచి మొక్కజొన్న ధాన్యం తీసుకువచ్చి శాంతిగనర్‌, మాన్‌దొడ్డి తదితర ప్రాంతాల్లో వారికి అనుకూలంగా ఉన్న కేంద్రాల్లోకి ధాన్యం తీసుకువస్తున్నారు. ఇలా తీసుకువచ్చేందుకు స్థానికంగా ఉన్న ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఏజెంట్లు తమ పాసు పుస్తకాలతోపాటు తమకు తెలిసిన వారి పాసు పుస్తకాల పేరిట పీఏసీఎస్‌ల నుంచి టోకెన్లు తీసుకుంటున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలోని సుంకేసుల, కొత్తకోట తదిదర గ్రామాల నుంచి వ్యాపారుల ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తున్నారు. ఎవరైనా వాహనాలు ఆపుతారనే నెపంతో, దీని కోసం ప్రత్యేకంగా రైతులను తీసుకెళ్లి వారి పాసు పుస్తకాలను చూపుతూ వాహనాలను కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడి అమా యక రైతులు మాత్రం తమ ధాన్యం సేకరించే వంతు ఇంకా రాలేదని, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తమ వెనుక వచ్చిన ధాన్యం కూడా లోడ్‌ అవుతుందని, తమకు మాత్రం ఇంకా టోకెన్‌ నంబర్‌ రావడం లేదని రైతులు వాపోతున్నారు.

కొత్త దారుల్లో రవాణా..

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సందర్భంలో ఏఎస్పీ శంకర్‌ చెక్‌పోస్టులను పరిశీలించి నిఘా పటిష్టం చేయాలని ఆదేశించారు. దీంతో అక్రమ వ్యాపారులకు తమ రవాణా ఆగుతుందని కొత్తదారులు వెతికారు. అలంపూర్‌ నియోజకవర్గంలో కొత్తగా వేస్తున్న ఆరు లైన్ల జాతీయ రహదారిపై దందా సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ రహదారి పనులు దాదాపు పూర్తికావడంతోపాటు కొన్ని చోట్ల సర్వీస్‌ రోడ్డు, రైతుల పంటలకు వెళ్లేందుకు వేసిన రోడ్లు ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ధాన్యం తీసుకువచ్చి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సైతం ఏపీ నుంచి తెచ్చిన ధాన్యాన్ని శాంతిగనర్‌ కొనుగోలు కేంద్రంలో అన్‌లోడ్‌ చేశారు. కానీ, లోడ్‌ ఎక్కడి నుంచి వస్తుందనే పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులే బాగుపడుతున్నారని, రైతులు నష్టపోతున్నారని, ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరినీ వదిలిపెట్టం..

అక్రమంగా వ్యాపారులు తీసుకువచ్చే ధాన్యం అమ్మి, రైతులను నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. టోకెన్‌ నంబర్లు కూడా మారుస్తున్నారని తెలుస్తుంది. దానిపై మాకు స్పష్టత రాగానే మా సిబ్బంది అని కూడా చూడకుండా ఎవరినీ వదిలిపెట్టం. శాంతిగనర్‌లో ఏపీ నుంచి ధాన్యం తెస్తున్న వ్యాపారులతో సిబ్బంది సంబంధాలపై ఆరా తీస్తున్నాం.

– శ్రీనివాస్‌, డీసీఎస్‌, గద్వాల

రాత్రి, పగలు తేడా లేకుండా

లోడింగ్‌, అన్‌లోడింగ్‌

చెక్‌పోస్టుల కన్నుగప్పి

కొత్తదారుల్లో ధాన్యం తరలింపు

వరి, మొక్కజొన్న కొనుగోలులో చేతులు మారుతున్న కమీషన్లు

స్థానిక రైతులకు

మాత్రం తప్పని పడిగాపులు

Advertisement
 
Advertisement
Advertisement