మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి
గద్వాల: జోగుళాంబ గద్వాల మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న జయలక్ష్మి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా నమ్మకంతో ప్రజలు వేసిన ఓట్లతో వచ్చిన పదవిని బాధ్యతతో నిర్వర్తించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్‌పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గద్వాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీలకు ఆర్థిక సహాయ పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నుషిత శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. టూల్ కిట్లు, జనరేటర్లు, రాళ్లు కత్తిరించే వృత్తిలో నిమగ్నమై న పేదవర్గాల పునరావాసం, జీవనోపాధి మె రుగుదల కోసం ఈ పథకం అమలు చేస్తున్నా మన్నారు. 21–55 ఏళ్లలోపువారు సర్టిఫికెట్, ఆధార్, రేషన్‌కార్డుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే మైనారిటీ యువతకు ఈ–స్కూటర్ల పంపిణీ పైలెట్ ప్రాజెక్టు అమలులో ఉందన్నారు. ఈ పథకంలో ఒక యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం, మిగిలిన వాటా లబ్ధిదారు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పథకానికి 21–40 ఏళ్ల వయస్సు గల పదో తరగతి విద్యార్హత, డ్రైవింగ్ లెసెన్స్ పాన్‌కార్డు కలిగి ఉండి గత ఐదేళ్లలో ప్రభుత్వ నుంచి ఎలాంటి పథకం పొందని వారు అర్హులన్నారు. ఆయా పథకాలకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు టీజీవోబీఎంఎంఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలో చౌరస్తా సబ్ స్టేషన్ పరిధిలోని రాయచూరు రోడ్డులో చెట్లు తొలగించే పనులు చేపడుతున్నందున శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ నవీన్‌బాబు, ఏఈ పరశురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయచూరు రోడ్డులో, అలంపూర్ చౌరస్తా నుంచి టోల్‌ప్లాజా వైపు చెట్లను తొలగించే పనులు చేపడుతున్నట్లు వివరించారు. దీంతో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


