ఇక ప్రలోభాల వంతు | - | Sakshi
Sakshi News home page

ఇక ప్రలోభాల వంతు

Feb 10 2026 7:29 AM | Updated on Feb 10 2026 7:29 AM

ఇక ప్

ఇక ప్రలోభాల వంతు

అసమ్మతివాదులపై ఫిర్యాదు..

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

విమర్శలు.. ప్రతివిమర్శలు

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం

గద్వాల: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగా.. ఇక చివరి అస్త్రంగా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలకు తెర లేపారు. గత పదిరోజులుగా పాటలు, ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. పెద్దసంఖ్యలో జనం, డీజే చప్పుళ్లు, మంది మార్బలంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బుధవారమే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. సోమవారం సాయంత్రానికి ప్రచారం పర్వం ముగియగా.. అభ్యర్థులు పెద్దఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. వారంరోజుల పాటు విరామం లేకుండా ప్రచార హోరు సాగించారు. పోలింగ్‌ ప్రక్రియకు 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలనే ఎన్నికల సంఘం నియమావళి మేరకు అన్ని పార్టీల అభ్యర్థులు సోమవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారం ఆపేశారు. మైకులు, పాటలు కూడా మూగబోగా.. మరోవైపు మద్యం దుకాణాలకు తాళాలు పడ్డాయి.

కాంగ్రెస్‌ పార్టీలో తలెత్తిన బీఫాంల వివాదం సద్దుమణగలేదు. సరిత వర్గానికి చెందిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి ప్రచారం చేశారు. అదే క్రమంలో తనకు ఏడు బీఫాంలు ఇస్తానని ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తూ డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌, ఎంపీ మల్లురవికి సరిత వర్గానికి చెందినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై స్పందించిన మల్లురవి విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో పోటీపడ్డ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రధానంగా గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గీయులు, బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల గెలుపును ఎమ్మెల్యే బండ్ల తన భుజస్కంధాలపై వేసుకుని 37 వార్డులలో సుడిగాలి పర్యటన చేపడుతూ.. మరోవైపు కులాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కాలనీ సంఘాలతో ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారం సాగించారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌కేశవ్‌, ఆంజనేయగౌడ్‌, బాసు హన్మంతు పార్టీ ప్రచార బాధ్యతలు స్వీరించి అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లడిగారు. ప్రధానంగా బీఎస్‌ కేశవ్‌ గతంలో తాను బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నానని అప్పుడే గద్వాల మున్సిపాలిటీ పెద్దఎత్తున అభివృద్ధి చెందినట్లు ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిందని.. మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మోసం పోవడం ఖాయమని ప్రజలకు వివరించారు. ఈసారి తనపై నమ్మకం ఉంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి చైర్మన్‌ పీఠం కట్టబెడితే గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. అలాగే ఆంజనేయగౌడ్‌, బాసు హన్మంతు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు.

బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో ప్రచార పర్వం సాగింది. చాలాకాలం తర్వాత మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి వార్డులలో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అడిగారు. గతంలో తాను, తన భార్య చేసిన అభివృద్ధి తప్పితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాలకు చేసిన అభివృద్ధి ఏమిలేదని ఆరోపణలు చేశారు. గద్వాల పట్టణం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించగా.. సభలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రత్యర్థులపై విమర్శనస్త్రాలు సంధించారు.

రాజకీయ పార్టీల ప్రచారపర్వం ఇలా ఉంటే మరోవైపు బుధవారం జరిగే పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్ని రకాల ఏర్పాట్లు, సిబ్బందికి విధుల కేటాయింపులు వంటివి పూర్తి చేసి సిద్ధం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ శ్రీనివాసరావు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్‌, ఆర్మ్‌డ్‌ పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతూ పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా చేసేలా ఏర్పాట్లు చేశారు. పోటీచేసే అభ్యర్థులు సాయంత్రం 5 గంటలకే ప్రచారాన్ని ముగించగా, మరోవైపు మద్యందుకాణాలకు సైతం తాళాలు పడ్డాయి.

జిల్లాలోని పురపాలికల్లో

వారంపాటు హోరెత్తిన మైకులు

నేతల మాటల తూటాలు, మద్యం దుకాణాలకు తాళాలు

ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు మద్యం, డబ్బులు రెడీ

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

రేపే పుర సమరం

ఇక ప్రలోభాల వంతు 1
1/2

ఇక ప్రలోభాల వంతు

ఇక ప్రలోభాల వంతు 2
2/2

ఇక ప్రలోభాల వంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement