నేటి మంత్రం.. చీలిక తంత్రం | - | Sakshi
Sakshi News home page

నేటి మంత్రం.. చీలిక తంత్రం

Feb 10 2026 7:29 AM | Updated on Feb 10 2026 7:29 AM

నేటి మంత్రం.. చీలిక తంత్రం

నేటి మంత్రం.. చీలిక తంత్రం

గద్వాల: జిల్లాకేంద్రలోని పలు వార్డుల్లో పార్టీలు ప్రత్యర్థి జోరును నిలువరించేందుకు అతనికి పడే ఓట్లలో చీలిక తేవడంపైనే దృష్టి సారిస్తున్నాయి. గడిచిన అనేక ఎన్నికల్లో గద్వాలలోని కొన్ని వార్డుల్లో చీలిక మంత్రం బాగా పనిచేసి అభ్యర్థులను విజయ పథంలో నడిపింది. ప్రస్తుతం అదే సూత్రాన్ని పాటించి గెలుపు సొంతం చేసుకోవాలని నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రధాన ప్రత్యర్థికి పడే ఓట్లను చీల్చగలిగే సత్తా ఉన్న అభ్యర్థుల పంట పండుతోంది. సదరు అభ్యర్థి తనకు ప్రధాన పోటీ కాదని భావిస్తే విస్తృతంగా పర్యటించి వీలైనన్ని ఎక్కువ ఓట్లు పొందాలని నేతలు ఆశీర్వదిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ధనంతో సహా అన్ని రకాల సహాయ సహకారాలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చైర్మన్‌ స్థానానికే పరిమితమైన ఈ మంత్రాంగం ఈ ఎన్నికల్లో కొన్ని వార్డులోనూ అమలవుతోంది. తమకు వచ్చే ఓట్లు ఎన్ని అనే అంశం కంటే మూడో అభ్యర్థి తన ప్రధాన ప్రత్యర్థి ఓట్లలో ఎన్నింటిని చీల్చగలరనే అంశానికే నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. పట్టణంలో పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గద్వాలలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే సాగుతోందని భావిస్తున్నారు. రెండు, మూడు వార్డులలో ఎంఐఎం, సీపీఐ, స్వతంత్రులు తాము కూడా ప్రధాన రేసులోనే ఉన్నామని చెబుతున్నా.. వీటిని ఓట్లు చీల్చే పార్టీలుగానే ప్రధాన పక్షాలు భావిస్తున్నాయి. కొన్నిచోట్ల బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు రోజురోజుకూ బలపడుతుండటం అధికార, ప్రతిపక్షానికి కంగారు పుట్టిస్తోన్నాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్నా వార్డుల్లో ఇతర పార్టీల అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ స్థాయిలో ఓట్లను పొదగలిగితే తమకు ఢోకా ఉండదని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. అదే తీరును బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు మైనార్టీల ఓట్లను ఎక్కువగా చీల్చకుండా కాంగ్రెస్‌, తన పాత ఓట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థులు గండికొట్టకుండా బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చాలా వార్డుల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓట్ల చీలికే నిర్ణయించనుందనేది స్పష్టమవుతోంది. రెండు వార్డులు మినహా మిగిలిన ప్రతి వార్డులో 1,500– 1,800 ఓట్లకు మించిలేవు. ఈసారి ఎవరు గెలిచినా కొన్ని వార్డుల్లో మెజారిటీ వంద ఓట్లకు మించకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చాలా వార్డుల్లో చీలిక ఓట్లు కొద్దిగా ఉన్నా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. చీలిక ఓట్లు తమకే అనుకూలిస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి చీలిక ఓట్లే ఫలితాన్ని శాసించబోతున్నాయి. గద్వాలలో త్రిముఖ, చతుర్ముఖ పోటీ తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓట్లు చీల్చడానికే కొన్ని పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ పోటీలో తాము ఓట్లు చీల్చడ మే కాకుండా గెలిచి నిరూపిస్తామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలను ఆశ ల పల్లకీ ఎక్కిస్తున్న చీలిక ఓట్లు ఈసారి ఎవరికి తీపి అనుభవాన్ని పంచునున్నాయో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement