నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి
గద్వాల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలు, అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తి చేశామని, అదేతరహాలో మున్సిపల్ ఎన్నికలు సైతం ఎలాంటి ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సామగ్రి తరలింపు సమయంలో పూర్తిస్థాయి బందోబస్తు కల్పించాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరే వరకు భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలన్నారు. ప్రతిరూట్ మొబైల్‌కు హెడ్‌కానిస్టేబుల్ ఇన్‌చార్జిగా ఉంటారని, పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, మద్యం, ప్రచార సామగ్రి, ఆయుధాలు తీసుకురాకుండా అవసరమైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నగదు, మద్యం వంటివి పంపిణీ జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో పుకార్లపై పర్యవేక్షణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రై డే సందర్భంగా సోమవారం సాయంత్రం 5 నుంచి గురువారం ఉదయం వరకు, అలాగే కౌంటింగ్ డే రోజు 13న మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


