ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
గద్వాల: మున్సిపాలిటీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ బీఎం సంతోష్ పర్యవేక్షించారు. గద్వాల మున్సిపాలిటీలో పర్యటించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు మున్సిపాలిటీ పరిధిలో 408 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో 290 మంది, అలంపూర్‌లో 33, అయిజలో 63, వడ్డేపల్లిలో 22 మంది ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు.
పుర ఎన్నికల్లో
విజయఢంకా మోగిస్తాం
అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్‌షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్‌సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పెరుగుతున్న
కిడ్నీ సమస్య బాధితులు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల ప్రజలు కిడ్నీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని.. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి వైద్య బృందంతో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా మండలాల్లో నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ మండలం మంతన్‌గోడ్, ఎర్నాగునపల్లి, కాట్రేవ్‌పల్లి, నర్వ మండలం రాయికోడ్, జక్కన్నపల్లి, పాతర్చేడ్‌లో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండువేల జనాభా లేని కాట్రేవ్‌పల్లిలో కిడ్నీ సమస్యతో పదేళ్లలో పదిమందికి పైగా మృతిచెందారని, డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఐదుగురు, డయాలసిస్‌కి చేరువలో 15 మంది ఉన్నారని సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ.రెండు వేలు ఇచ్చి, మక్తల్‌లో డయాలసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకొనే ధోరణిలో ఉందని, వెంటనే ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఆయా మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలని సూచించారు. ఆయా మండల కేంద్రాల్లో వారానికి రెండుసార్లు నెఫ్రాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచాలని, డయాలసిస్ సెంటర్ సామర్థ్యం పెంచి రోగులకు నెలకు రూ.12 వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు దిలీప్, తాళ్ల రోహిత్, సభ్యులు శ్రీధర్, వెంకటనారాయణ , బొల్లి ఆదాంరాజు ఉన్నారు.
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్


