పదేళ్లలో గద్వాల అస్తవ్యస్తం
గద్వాల: ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందో విజ్ఞులైన గద్వాల పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గడిచిన పదేళ్లలో అభివృద్ధి చేసే నాయకులు లేకపోవడంతో గద్వాల పట్టణం మొదలుకుని నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్లు లేని నిరుపేదలకు 3 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తే.. ఇప్పుడు వాటిని బలవంతంగా లాక్కుని రోడ్డున పడేశారని మండిపడ్డారు. ముఖ్యంగా సాగు, తాగునీరు, రహదారులు, పేదలకు ఇళ్లు, పాఠశాల నిర్మాణాలు, నెట్టెంపాడు పథకం తాను సాధించానని ఆ ప్రాజెక్టు వచ్చిన తర్వాతే గద్వాల పెద్దఎత్తున అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. చేనేత పార్కు నిర్మాణం ఇప్పటి వరకు అతీగతి లేదని, పట్టణంలోని 37 వార్డులలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఎంతమాత్రం లేదన్నారు. పనిచేసే వ్యక్తులనే గెలిపించాలని పట్టణ ప్రజలు ఆలోచించి బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, వెంకట్రాములు, పద్మావతి, కృష్ణవేణి, నర్సింహులు, వెంకటేశ్వర్‌రెడ్డి, దేవదాసు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.


