వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్ వాహన సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే ప్రభోత్సవం నిర్వహించారు.
వైభవంగా రాములోరి కల్యాణం


