77 వార్డులు..525 నామినేషన్లు
● ముగిసిన నామినేషన్ల దాఖలు పర్వం
● చివరిరోజు పోటాపోటీగా దాఖలు
● జిల్లాలోని నాలుగు
మున్సిపాలిటీల్లో సందడి
గద్వాల టౌన్: పార్టీ జెండాల రెపరెపలు.. డప్పు వాయిద్యాలు.. మేళతాళాలు.. బాణసంచా.. కార్యకర్తల కేరింతల మధ్య మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరిరోజు కావడంతో పోటీచేసే అభ్యర్థులందరూ శుక్రవారం ఒకేసారి ముందుకు రావ డంతో జిల్లాలోని నాలుగు పట్టణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాలలో నామినేషన్ల జాతర కనిపించింది.
అన్ని పార్టీల నుంచి..
జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 స్థానాల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి పోటెత్తారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయగా.. ఎంఐఎం, బీఎస్పీ, ఆప్, పార్వర్డ్ బ్లాక్ పార్టీలతోపాటు స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థులు సైతం పట్టున్న వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల తరపున అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలను అందించారు. మొదటి రెండు రోజులు అనుకున్న స్థాయిలో నామినేషన్లు దాఖలు కాలేదు. శుక్రవారం తుది గడువు ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్దమొత్తంలో నామినేషన్లు వేశారు. జిల్లావ్యాప్తంగా మొదటిరోజు 5, రెండోరోజు 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చివరిరోజు ఏకంగా 401 నామినేషన్లు వచ్చాయి. మూడు రోజులకు గాను జిల్లాలో మొత్తం 525 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 186 , బీఆర్‌ఎస్ 145, బీజేపీ 93, పార్వర్డ్ బ్లాక్ 17, ఎంఐఎం 6, బీఎస్పీ 6, ఆప్ 1, సీపీఐ 1, సీపీఎం 1, జనసేన నుంచి 12 నామినేషన్లు దాఖలు కాగా.. మిగతావి స్వతంత్రుల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డుల నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతోపాటు మరో ఇద్దరిని కార్యాలయంలోకి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంతమంది అభ్యర్థులు హంగు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్లు వేయడం విశేషం. నామినేషన్ల ప్రక్రియలో తొలి ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


