శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాలు ప్రారంభం
గద్వాల టౌన్: జిల్లాకేంద్రంలోని కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఆలయంలో ఉదయం మూల విరాట్‌కు నిత్య విశేష, ఫల పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. సాయంత్రం ధ్వజారోహణం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను హనుమద్ వాహనంపై ఊరేగించారు. భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ఆలయంలో స్వామివారి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి ఆలయ ఆవరణలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఔత్సాహిక గాయకురాలు విజితాగౌడ్ బృందం చేత అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయన్నారు.


