చిరుధాన్యాలు.. అంతంతే
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో చిరుధాన్యాల సాగు కనుమరుగవుతుందా..? అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది కేవలం 45 ఎకరాల్లో మాత్రమే ఆయా పంటలు సాగు కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో రైతులు ఆసక్తి కనబర్చడం లేదు. మరో ముఖ్య ఆహార పంటలైన అయిన జొన్న, సజ్జ సాగు విస్తీర్ణం మాత్రం గతంతో పోల్చితే కాస్త పెరగడం గమనార్హం.
మారిన ఆహారపు అలవాట్లతో..
ప్రస్తుత దైనందిన జీవితంలో చాలామంది అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనవుతుండటంతోపాటు ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు రకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు తదితర వాటి బారినపడటంతోపాటు కిడ్నీ, లివర్, గుండె సంబంధిత సమస్యలతో శారీరకంగా బలహీన పడుతున్నారు. ఇలాంటి వారికి బలవర్ధకమైన ఆహారం చిరుధాన్యాలే. ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రల్లో పీచుపదార్థాలతోపాటు బలమైన పోషక విలువలుంటాయి. రాగుల్లో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే బీపీ, షుగర్ లాంటి రోగాలు దూరం కావడంతోపాటు శారీరకంగా బలపడతారు.
మద్దతు లేకపోవడంతో..
గత కొన్నేళ్ల నుంచి చిరుధాన్యాల వినియోగంపై వైద్యులు పెద్దఎత్తున సలహాలు ఇస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. అయినా చిరుధాన్యాల సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధానంగా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే అని చెప్పవచ్చు. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోంది. అలాగే ఆయిల్‌పాం, పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ చిరుధాన్యాలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
‘ఆత్మ’కు నిధులేవి?
చిరుధాన్యాల సాగుపై వ్యవసాయాధికారులు వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో 2019లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌ఎస్) పథకం కింద పండించే రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించి ప్రోత్సహించారు. దీంతో 2016, 2017, 2018 గణాంకాలను పోల్చితే 2019లో సాగు పెరిగింది. ఆ తర్వాత 2020 నుంచి మళ్లీ తగ్గింది. ఇందుకు ప్రభుత్వం ‘ఆత్మ’కు గడిచిన ఐదేళ్లుగా నిధులు కేటాయించకపోవడమే కారణం. ఫలితంగా రైతులు ఎప్పటిలాగే వరి, పత్తి పంట సాగుకు మొగ్గుచూపారు.
మరింత పెరిగేలా..
జొన్న, సజ్జలు పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం. ఈ పంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగిన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వీటికి మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు ఉన్నాయి. 10, 15 ఏళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ సాగు చేసిన రైతులు ఆ తర్వాత వరి, పత్తి లాంటి పంటలను వేస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు నాణ్యమైన జొన్నలు లభించకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో జొన్న, సజ్జల సాగు మరింత పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
చి,లు: చిరుధాన్యాలు
జిల్లాలో ఈ ఏడాది గణనీయంగా తగ్గిన సాగు
ప్రభుత్వ ప్రోత్సాహం
లేకపోవడమే కారణం
అక్కడక్కడ పెరిగిన జొన్న, సజ్జ పంటలు
రెండు సీజన్లలో సాగు..
చిరుధాన్యాలన్నీ ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయవచ్చు. అయితే ఈ పంటల్లో కలుపు ఎక్కువగా వస్తుంది. పెట్టుబడులు సైతం రెట్టింపు అవుతాయి. దీనికితోడు నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేదు. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కూడా లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, మిర్చి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, వరి, మొక్కజొన్న లాంటి ఆహారపు పంటలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.
అవగాహన కల్పిస్తాం..
ఇక్కడి రైతులు వాణిజ్య, ఇతర ఆహార పంటలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. రాగులు, కొర్ర, అండుకొర్రలు సాగు చేసేలా రైతులకు ప్రతిసారి చెబుతూనే ఉన్నాం. చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. జొన్న, సజ్జ పంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగింది.
– సక్రియానాయక్, డీఏఓ


