‘అక్రమార్కులకు చెక్ పెడదాం’
అయిజ: కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు వసూలురాజాగా చలామని అవుతున్నాడని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అక్రమార్కులకు చెక్ పెడదామని ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు పూర్తై, నోటిపికేషన్ వెలువడనున్న సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్‌ఎస్ నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక, మట్టి అక్రమాల వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై చూపడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


