పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత ఆర్‌ఓ, ఏఆర్‌ఓలపై ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పరంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నందున జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు నిబంధనల ప్రకారం నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల సంఘం ముద్రించిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని ప్రకారమే కేటాయించిన విధులను కౌంటింగ్ ప్రక్రియలో వ్యాలిడ్, ఇన్‌వ్యాలిడ్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా చేపట్టాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర శిక్షకులు హరినాథ్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఎన్నికల విధులపై వర్చువల్‌గా అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ సీఈఓ నాంగేంద్రం, ఎన్నికల నోడల్ అధికారి రమేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


