బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
ఎర్రవల్లి: బాల్య వివాహాలను ప్రోత్సహించినా.. సహకరించినా చట్టరీత్యా నేరమని సీడీపీఓ సుజాత అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా, శిశు, సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై సర్వీస్ ప్రొవైడర్స్, పురోహితులు, ఖాజీలు, ఫాస్టర్స్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ నిర్వాహకులకు బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలతోపాటు అందుకు ప్రోత్సహించిన వారికి పడే శిక్షల గురించి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్‌కు ఎంతో ఆటంకం కలిగిస్తాయన్నారు. పెళ్లికి ముందే ఇరువురి వయస్సును ప్రతిఒక్కరూ తప్పకుండా ధ్రువీకరించుకోవాలని సూచించారు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నాయని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, వారిని ప్రోత్సహించి చదివిస్తే ఉన్నత చదువులు చదివి విద్యావంతులు అవుతారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే రూ.లక్ష జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారని హెచ్చరించారు. అలాగే వివాహానికి సహకరించిన వారిపైన కూడా ఎఫ్‌ఐఆర్ నమోదవుతుందన్నారు. బాల, బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100, 1098కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్, బాలల సంరక్షణ అధికారులు నర్సింహ, రవి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్లు శివలీల, జయ్యన్న పాల్గొన్నారు.


