యథేచ్ఛగా అడ్డ‘దారి’ | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా అడ్డ‘దారి’

Jan 24 2026 7:27 AM | Updated on Jan 24 2026 7:27 AM

యథేచ్

యథేచ్ఛగా అడ్డ‘దారి’

గద్వాల టౌన్‌: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జనాభా పెరుగుతోంది.. రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువైంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించాలి. అయితే.. కొందరు స్వార్థపరులు మాత్రం ఉన్న దారులనే మింగేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి స్థిరాస్తి వ్యాపారానికి ‘దారి’తీశారు. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో అక్రమార్కుల బరితెగింపు రోజురోజుకూ మితిమీరుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

కబ్జా చేసి.. ప్లాట్లుగా విక్రయించి

జిల్లాకేంద్రంలో అత్యంత ఖరీదైనా ప్రాంతాలలో కొత్తహౌసింగ్‌ బోర్డుకాలనీ ఒకటి. ఈ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్‌ 789లోని రెండు ఎకరాల స్థలంలో 1988లోనే అధికారికంగా ఎల్‌పీని ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలారు. అయితే ఈ ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డును కొంతమంది కబ్జాచేసి ప్లాట్లుగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ ప్లాట్లను అధికార పార్టీకి చెందిన నేతలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కబ్జాకు గురైన ఆ స్థలం బహిరంగ మార్కెట్‌లో రూ.4 కోట్లు ఉంటుంది. కబ్జా చేసిన ప్లాట్లకు దారి లేకపోవడం, వాటిని అభివృద్ధి చేసుకొనేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరు ఏమీ చేయరనే ఉద్దేశంతో ఏకంగా ప్లాట్లకు ఆనుకుని ఉన్న హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ప్రజా అవసరాల ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించేశారు. అందరూ చూస్తుండగానే అధికార పలుకుబడితో నిబంధనలకు తుంగలో తొక్కి ఖాళీ స్థలంలో మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్రమ ప్లాట్లలో దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపి, ఫిర్యాదు చేసినా అధికార బలం ముందు ఫలితం లేకుండా పోయింది. ఎల్‌పీలోని ఖాళీ స్థలంతోపాటు రహదారిలో ప్లాట్లు ఏర్పాటు చేయటం, హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఖాళీ స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమైనా కబ్జాదారులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

నేతల బాహాబాహీ..

రాజకీయ ఒత్తిడితో స్థలాల కబ్జా, అక్రమ నిర్మాణాల గుర్తింపు వ్యవహారం పక్కదారి పడుతోంది. కొంతమంది నేతల అండతో సాగుతున్న కబ్జాల పర్వానికి అంతే లేకుండా పోతుంది. దీనిపై రెండేళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు ఉన్న కలెక్టర్‌ కబ్జాలపై సీరియస్‌గా తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపిచేయించారు. ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటాన్ని అదునుగా తీసుకుని అక్రమార్కులు మళ్లీ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చెప్పినప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. పైగా ‘ఆ ప్లాట్లు మనోళ్లవే ఎవరు ఫిర్యాదు చేసినా అక్కడికి వెళ్లొద్దని ముఖ్య నాయకులు అధికారులకు ఫోన్‌ చేసి హెచ్చరించడం విశేషం.

ఎల్‌పీలోని రోడ్డు, ఖాళీ స్థలం కబ్జా

ప్లాట్లు ఏర్పాటు చేసి.. దుకాణాల నిర్మాణం

రూ.4 కోట్ల విలువైన స్థలం పరులపాలు

ఫిర్యాదు చేసిన వారిపైనే కబ్జాదారుల బెదిరింపులు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

‘ఇక్కడ కనిపిస్తున్న దుకాణ నిర్మాణాలు, ప్లాట్ల హద్దులు సర్వే నంబర్‌ 789 అప్రూవుడ్‌ లే అవుట్‌ ప్లాన్‌లోనివి. ఎల్‌పీలో ఉన్న ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డు మధ్యలో వీటిని ఏర్పాటు చేశారు. నిబంధలను పట్టించుకోకుండా లే అవుట్‌లోని ఖాళీస్థలం, రోడ్డును కొంతమంది దౌర్జన్యంగా కబ్జా పెట్టి ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. ఈ ప్లాన్‌కు ఆనుకుని ఉన్న కొత్త హౌసింగ్‌ బోర్డుకు చెందిన ప్రజా అవసరాల స్థలాన్ని కూడా

కబ్జా చేశారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే ప్రత్యామ్నాయంగా మరోచోట రోడ్డు

వేస్తామని బెదిరిస్తుండటం గమనార్హం.

యథేచ్ఛగా అడ్డ‘దారి’ 1
1/1

యథేచ్ఛగా అడ్డ‘దారి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement