భక్తిశ్రద్ధలతో వసంత పంచమి పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు కనులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సరస్వతిదేవిని దర్శించుకొన్నారు. అనంతరం సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్రచారి, దినకరన్, దత్తుస్వామి, భానుమూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో 280 మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ వెంకటాద్రి, జనరల్ సెక్రెటరీ సీతారామిరెడ్డి, మేనేజర్ సురేందర్‌రాజు, సభ్యులు విజయమోహన్‌రెడ్డి, నారాయణనాయుడు, నాగబలిమి, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వసంత పంచమి పూజలు


